
శాంతి మిత్ర
94900 99167
ఏ సమాజం గురించి తెలుసుకోవటానికైనా చరిత్ర ఒక ఆధారం. ఏ సమాజంలోని స్త్రీల స్థితిగతుల గురించి అర్థం చేసుకోవటానికి ఆ సమాజంలోని సంస్కృతి గొప్ప ఉపకరణం. సమాజంలోని ఎవరి స్థానం ఎక్కడో, ఎవరి పాత్ర ఏమిటో, ఎవరికెంత ప్రాధాన్యమో సాంస్కృతిక జీవనం పట్టి చూపిస్తుంది. ఒక దేశ లేదా ప్రాంత ప్రజల యొక్క ఆచార వ్యవహారాలూ, కట్టుబాట్లు, కట్టూబొట్టూ, భాష యాస, ఆహారం ఆహార్యం, వినోద విహారాలూ.. ఇలాంటివి ఎన్నో కలిస్తే – అది ఆ దేశ లేదా ఆ ప్రాంత సంస్క ృతి అవుతుంది. విశాలమైన భారతదేశంలో విభిన్నమైన సంస్క ృతులు, సాంప్రదాయాలు కనిపిస్తాయి. ఒకే ప్రాంతంలోని వివిధ సమూహాల్లో కూడా భిన్నమైన ఆచార వ్యవహారాలు అమల్లో ఉంటాయి. కాబట్టే మన దేశానిది భిన్నత్వంలో ఏకత్వం అంటాం. మనందరి ఏకతను చాటేది భారతీయత ఒక్కటే!
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న భారతీయ సమాజంలో మహిళల స్థానం ఎక్కడీ పాత్ర ఎలాంటిది? ఈ ప్రశ్నలకు జవాబులను అన్వేషించి, ఒక కుప్పగా పోసి విశ్లేషిస్తే – సారాంశం ఒక్కటే! సాంస్కృతిక రూపాలు వేర్వేరుగా ఉన్నా.. స్త్రీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూడటమే అన్నిచోట్లా కనిపిస్తోంది. అలా చూడబడడంలో ఆర్థిక, ఆధిపత్య కారణాలే కీలకం. కానీ, నేరుగా అలాంటి అభిప్రాయం కలగకుండా ‘సంస్కృతి’, ‘సాంప్రదాయం’ అనే రెండు మాటలూ నాజూకుతనాన్ని అద్దుతాయి. వాటిని అమలు చేయడం, పర్యవేక్షించటం, పద్ధతి అని ప్రచారం చేయడం పూర్తిగా తమ బృహత్తర బాధ్యతగా స్వయంగా మహిళలే భావించేలా వాటి నిర్మాణం ఉంటుంది.
ఊరకనే పోలేదు దురాచారాలు!
ఇప్పుడు చెప్పుకుంటే చాలా విడ్డూరంగా, భయంకరంగా, అమానవీయంగా ఉండే సతీసహగమనం ఒకప్పుడు మన దేశంలో అమలైన ఆచారం. చనిపోయిన భర్త చితిలోనే బతికి ఉన్న భార్య ‘ఇష్టపూర్వకంగా’ దూకి చనిపోవటం.. ఎంత దుర్మార్గం? కానీ, దానిని పాటించటం ఒక గౌరవంగా ప్రచారం చేశారు. శవ ఊరేగింపు, వాయిద్యాల, పాటల సందడి మధ్య స్వయంగా ఆమె చేతనే ‘నేను నా భర్తతో పాటు వెళ్లిపోతున్నాను.’ అనేంత పూనకాలు రేకెత్తించేవారు. ఇది అభ్యంతర అమానవీయమని 1515లో పోర్చుగీసు వారు మొదలుకొని, 1987లో భారత ప్రభుత్వం వరకూ అనేకసార్లు నిషేధ ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది. పవిత్రత, సాంప్రదాయం, స్వర్గం, ధర్మం పేరిట సాంస్కృతిక జీవితంలోకి ఇంకిపోయిన లేదా ఇంకించబడిన దురాచారాలను సైతం ఒక్క చట్టంతోనో, బోధనతోనే నిర్మూలించటం కష్టం. ఆ దురాచారం ఎంత మూలాల్లోకి ఇంకిపోయిందో అంత మూలాల్లోకి వెళ్లి ప్రణాళికాబద్ధమైన ప్రచారం చేయాల్సి ఉంటుంది. ‘సతీసహగమనం అనే సాంప్రదాయాన్ని నిషేధించటం సరైంది కాదు.. అది హిందూ సాంప్రదాయాల్లో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకోవటమే’ అని అప్పట్లో కొంతమంది సనాతనవాదులు కోర్టుకు కూడా వెళ్లారు. దీనిని బట్టి సంస్కృతి సంబంధ విషయాల్లో జోక్యం చేసుకొని- మార్పును తీసుకురావటానికి మన సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు ఎంత కష్టపడ్డారో, ఎన్ని వాదనలూ ఆటంకాలూ అవమానాలూ ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవొచ్చు.
బాల్య వివాహాలను నిషేధించినప్పుడు, వితంతు వివాహాలకు అవకాశం కల్పించినప్పుడు, బసివి, దేవదాసీ వంటి దుర్మార్గ వ్యవస్థలను అడ్డుకున్నప్పుడు.. సనాతనవాదులు ‘ధర్మం’ నశించిపోతుందని గగ్గోలు పెట్టారు. మన తెలుగు నాట రాజమహేంద్రవరంలో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం వితంతు వివాహాలు జరిపితే – ఛాందసులు ఆయన్ని కులంలోంచి వెలేశారు. నానా తిట్లూ తిట్టారు. కర్రలతో దాడి చేయటానికి దండెత్తి వచ్చారు. అప్పుడు ఆయన ఒంటరి అయినా తన లక్ష్యం నుంచి తప్పుకోలేదు. అభ్యుదయం కోరుకున్న యువకులూ, ఇతర పెద్దలూ ఆయనకు అండగా నిలబడ్డారు. కన్యాశుల్కానికి ఆశపడి ముక్కుపచ్చలారని బాలికలను ముదుసలి వారికి కట్టబెడుతున్న దురాశా దుర్మార్గాన్ని ఎంతగానో వ్యతిరేకించారు మహాకవి గురజాడ అప్పారావు. ఈ కారణం చేత ఆయన్ని కూడా ఆనాటి ఛాందసవాదులు తూలనాడారు. అసహ్యకరమైన అపవాదులు మోపారు. అన్నిటికీ కాలమే సమాధానం
చెప్పింది. అన్ని సందర్భాల్లోనూ అభ్యుదయమే గెలిచింది.
కాలానుగుణ ఆచరణే..
ఏ సమాజంలో అయినా, ఏ కాలంలో అయినా మంచిని ఆచరించటం, చెడును తిరస్కరించటం ఆరోగ్యకరమైన లక్షణం. ఎదుగుతున్న ఏ సమాజంలోనైనా అలాంటి పని ఆలోచనాపరుల ఆధ్వర్యంలో సవ్యంగా జరిగిపోతూ ఉండాలి. యథాతథవాదులు, సనాతనవాదులు, ఛాందసులు ఆ సహజమైన మార్పునకు అడ్డుపడుతూ ఉంటారు. గతమంతా గొప్పది అంటారు. కాబట్టి వాదనలు, సంఘర్షణలు జరుగుతాయి. అయితే, వాదనలో శాస్త్రీయత లేని కారణంగా పురాతన భావజాలం ఉన్నవారు తమ ధర్మం మీద దాడి జరుగుతుందని రాద్ధాంతం మొదలుపెడతారు. మారిన కాలానికి అనుగుణంగా మారాల్సి ఉన్నా, మార్పునకు మోకాలడ్డుతారు. ఈ తతంగంలోకి ఇప్పుడు రాజకీయం ప్రవేశించటం వల్ల మళ్లీ దుస్సంప్రదాయాలకు ప్రాణం పోసే పనికి కొంతమంది పనిగట్టుకొని ప్రచారం కల్పిస్తున్నారు. బ్రిటీషు పాలనలోనూ, స్వాతంత్య్రం అనంతరం కూడా దురాచారాలకు, దుస్సంప్రదాయాలకు వ్యతిరేకంగా అభ్యుదయవాదులు పోరాడినప్పుడు ప్రభుత్వాల నుంచి మద్దతు ఉంది. వాదన, ఆవేదన వినిపించటానికి అవకాశం దక్కింది. ఎన్నో కొత్త చట్టాలు రావటానికి వీలుపడింది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనటం ఆందోళనకరం. సాక్షాత్తూ పాలకులే పాత భావాలను నెత్తిన పెట్టుకొని ఊరేగటం మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కూడా!
వివిధ రూపాల్లో ‘చాదస్త’ దాడులు..
ఏ మతాచారాలైనా సరే, సంస్కృతిగా స్థిరపడి, ముఖ్యంగా మహిళలపై నియంత్రణకు ఉపక్రమిస్తాయి. ఇలాంటి బట్టలే ధరించాలి, ఇలాంటి ఆహారమే తినాలి, ఇలాగే ప్రవర్తించాలి అన్న సూక్తిముక్తావళిని ప్రవచిస్తాయి. ఇందులోకి మతతత్వ శక్తులు ప్రవేశించి, అలా ఎవరైనా, ఏ కారణం చేతైనా ఉండకపోతే నిందిస్తాయి. ఇది మన భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నం. వ్యక్తిహక్కులపై దాడి. ఆ మధ్య హర్యానాలో తన సొంత మనవరాలే జీన్స్ ప్యాంటు ధరించిందని ఓ తాత తీవ్రంగా దండించి, చంపేశాడు. ఎంత దారుణం ఇదీ?
ప్రతి ఆధునిక ప్రవర్తనను పురాణ కాలంలోని పాత్రలతో, ప్రవర్తనలతో పోల్చటం, తీర్పులు చెప్పటం ఈమధ్య కాలంలో పెరిగింది. ఏ కాలం విలువలు ఆ కాలంలో ఉంటాయి. వాటిని మరొక కాలంలో వర్తింపచేయలేం.. చేయకూడదు. మహిళల వస్త్రధారణ, అలంకరణలను ‘ఇలా ఉండాలి.. ఇలా ఉండకూడదు’ అన్న పోలీసింగ్ ధోరణులు పెరుగుతున్నాయి. ఆధునిక కాలం మహిళ ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఎలా ఉండాలో తను నిర్ణయించుకుంటుంది. దానిలో వేరొకరి జోక్యం అనవసరం.
అనేక వంటలు, వడ్డనలు, వివిధ పూజల్లో నివేదనలు గొప్పగా ప్రచారం జరుగుతున్నాయి. ‘ఇదీ, మన సంస్కృతి’ అంటూ సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియాలోనూ గొప్పలు మోతెక్కుతున్నాయి. ఇది ప్రదర్శన సంస్కృతి, వ్యాపార సంస్కృతి తప్ప ప్రజల సంస్కృతి కాదు. ఈ ధోరణి ప్రబలితే కుటుంబాలపై ఆర్థిక భారం, మహిళలపై పనిభారం పెరుగుతాయి.
ఇప్పుడు మతమూ, మార్కెట్టూ చెట్టాపట్టాలు పట్టుకొని చెలరేగిపోతున్నాయి. ఒకదానికొకటి సహాయపడుతూ, వ్యాపారం పెంచుకుంటున్నాయి. ఈ పాత్రలే వాడాలి, ఈ తరహా పూజలు, వ్రతాలు చేయాలి, ఈ రంగు బట్టలు ధరించాలి తదితర ప్రచారాన్ని మతం హోరెత్తిస్తుంటే- మార్కెట్టు భక్తిని జోడించి, వాటిని అమ్మకానికి పెడుతోంది.
ఆధునిక కాలంలో మహిళలు ఇంటా బయటా బోలెడు శ్రమ చేయాల్సి వస్తోంది. దీనికి సాంప్రదాయకమైన తంతులూ అంతకంతకు పెరగటం అదనపు బరువు. దానిని కొంతమంది మహిళలే మహదానందంగా స్వీకరించి, పరవశించేలా చేయటం ‘సాంస్కృతిక’ పూనకం!
ఎవరి పని వారు చేయాలి.. ఏ కులం వారు ఆ ధర్మాన్ని అనుసరించాలి’ అని ప్రవచనకర్తలు పదే పదే ఉపదేశించటం ఈ మధ్య పెరిగింది. స్త్రీలు ఇంటి పనికే పరిమితం కావాలన్న పరమార్థం కూడా ఇందులో ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థను వల్లె వేసే మనుస్మృతిని ఘనంగా వెనకేసుకొచ్చే ఛాందసులు యూట్యూబుల నిండా ఉద్ఘోషిస్తున్నారు. ఇది అన్ని తరగతుల మహిళలకు అత్యంత నష్టదాయకం.
మతం తన ఉపదేశాలను ఎంత అందంగా వినిపించినా, మార్కెట్టు తన ఉత్పత్తులను ఎంత అందంగా ప్రదర్శించినా- రెండూ స్త్రీలను తక్కువ దృష్టితోనే చూస్తాయి. చూస్తున్నాయి.
సమానత్వమే ఆధునిక సంస్కృతి..
సమానత్వం ఈ కాలపు సంస్కృతి. ఇంటా బయటా నేడు మహిళలది విశాలమైన, విస్తారమైన పాత్ర. దానికి తగిన విధంగా మన సమాజ నిర్మాణం ఉండాలి. ఇంకా పురాతన కాలంలోని అణచివేత సంస్కృతితోనే మహిళలను చూడడం కుదరదు. కొన్ని వేల సంవత్సరాల నాటి భావాల దగ్గరే అన్ని మత సంస్కృతులూ, ఆచరణలూ ఆగిపోయి ఉన్నాయి. వాటిని దాటి మనం చాలా ముందుకు వచ్చాం. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన నాటి వాలంటీనా తెరిస్కోవా నుంచి నేటి సునీతా విలయమ్స్ వరకూ అందుకు ప్రబల నిదర్శనం. పురా తాతల, సనాతన అమ్మమ్మల కథలను కథలకే పరిమితం చేయాలి. ఆధునిక మహిళల అద్భుత ప్రస్థానానికి అనుగుణంగా మన సమాజ, సాంస్కృతిక విలువల నిర్మాణం జరగాలి. గురజాడ ఆశించినట్టుగా ‘ఆధునిక స్త్రీ చరిత్రను తిరగ రాయడం’ మొదలెట్టి చాలా కాలమైంది. ఛాదస్తాలతో, పురాతన భావాలతో మళ్లీ ‘వెనక్కి’ చూడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు!
శాంతిమిత్ర
94900 99167