
పొత్తూరి సురేష్‌కుమార్, సుప్రీం కోర్టు అడ్వకేట్ 9849401041
న్యాయవ్యవస్థకు ప్రతీకగా ‘న్యాయదేవత’ ‘లేడీ జస్టిస్’ను సూచిస్తారు. దేవుడుని సూచించలేదు. భారత దేశానికి ప్రతీకగా భారతమాతను సూచిస్తారు. మహిళను ప్రతీకగా సూచించే దేశంలో, మహిళా దేవతను ప్రతినిధిగా స్వీకరించిన న్యాయవ్యవస్థలో మహిళలకు న్యాయం జరుగుతోందా అనేది ప్రస్తుత ప్రశ్న.
మనదేశంలో స్త్రీలకు న్యాయవాద వృత్తిలో తొలిసారి ప్రవేశానికి అవకాశం కల్పించిన చట్టం ”లీగల్ ప్రాక్టీషనర్స్ (ఉమెన్)” చట్టం, 1923. అంతవరకు అనేక కారణాలు చెప్పి మహిళలకు ఈ వృత్తిలో ప్రవేశం కల్పించలేదు. అప్పటివరకు స్త్రీల పట్ల చూపుతున్న వివక్షను ఈ చట్టం తొలగించింది. ఇండియన్ బార్ కమిటీ సూచనలు మేరకు ఈ చట్టం రూపొందించబడింది. 1672లోనే బ్రిటీష్ ఇండియాలో కోర్టుల ప్రస్తావన మొదలైనా 1884 చట్టం వరకు మహిళలకు అవకాశం కల్పించబడలేదు.
రెజీనా గుహ విషాదం..
న్యాయవాద వృత్తిలో ప్రవేశానికి పోరాడిన తొలి మహిళగా రెజీనాగుహ అనే కోల్‌కతాకు చెందిన జూయిష్ భారతీయురాలని పేర్కొంటారు. న్యాయవాద విద్యను పూర్తిచేసిన తర్వాత న్యాయవాదిగా పేరును నమోదు చేసుకోవటానికి కోల్‌కతా హైకోర్టులో ఆమె చేసుకున్న దరఖాస్తు తిరస్కరించబడింది. దీనిపై ఆమె ఐదుగురు జడ్జీల బెంచ్ ముందు 1916లో వేసిన కేసులో కూడా ఆమె నిరాశను ఎదుర్కోవలసి వచ్చింది. అప్పటి చట్టాలు స్త్రీలకు అవకాశం కల్పించడం లేదని కోల్‌కతా హైకోర్టు తీర్పు చెప్పింది. 1923 చట్టం వచ్చేసరికి ఆమె మరణించిందని ఎన్ఎల్ఎస్ఐయు బెంగళూరు తెలిపింది. ఒడిశాకు చెందిన మధుసూధన్ దాసు మహిళలకు న్యాయవాద వృత్తిలో ప్రవేశం కొరకు, 1923 చట్టం రావటానికి కృషి చేశారు. అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.
ప్రస్తుత స్త్రీ ప్రాతినిధ్యం..
1923 చట్టం వచ్చిన వందేళ్ల తర్వాత కూడా, 2022 నాటికి మొత్తం సుమారుగా ఉన్న 18 లక్షల మంది న్యాయవాదులలో మహిళలు 15%, గుర్తించబడిన సీనియర్ న్యాయవాదులలో 3.4%, రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో 441 మందికి గాను నలుగురు స్త్రీలున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఒక్క మహిళకు కూడా ప్రాతినిధ్యం లేదు.
తొలి స్త్రీ న్యాయవాదులు.. న్యాయమూర్తులు..
రెజీనాగుహ కథ విషాదాంతం కావటంతో కర్నాలియ సారాబ్జీ తొలి మహిళా న్యాయవాదిగా గుర్తించబడ్డారు. ఆమెకు కూడా మొదట ఈ వృత్తిలో ప్రవేశానికి తిరస్కరించడినప్పటికి, చాలా ఏళ్ల తర్వాత 1923 చట్టం ద్వారా అలహాబాద్ హైకోర్టులో తొలి మహిళా న్యాయవాదిగా నమోదు చేయబడ్డారు.
జస్టిస్ అన్నాచాంది తొలి హైకోర్టు మహిళా న్యాయమూర్తిగా కేరళ హైకోర్టులో 1959లో నియమించబడ్డారు. చాలా దశాబ్దాలు జడ్జీలలో స్త్రీల సంఖ్య నామమాత్రంగానే ఉంది. 1989లో తొలిసారిగా జస్టిస్ ఫాతిమా బీబి సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తిగా నియమించబడ్డారు. జస్టిస్ లీలాసేత్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు.
ఉన్నత న్యాయస్థానాలలో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం..
ఇప్పటివరకూ మన దేశానికి ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి నియమించబడలేదు. 2027లో జస్టిస్ బీవీ నాగరత్న గారి ద్వారా ఆ లోటు పూడ్చేందుకు అవకాశం ఉంది. ఫిబ్రవరి 2025 లెక్కల ప్రకారం 25 ఉన్నత న్యాయస్థానాలలో ఎనిమిది కోర్టులలో ఒక్కరే మహిళా న్యాయమూర్తి ఉన్నారు. 2018 నుంచి హైకోర్టులలో నియమితులైన న్యాయమూర్తులలో కేవలం 18% మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2024 ఆగస్టు లెక్కల ప్రకారం మొత్తం హైకోర్టులలో 14% మాత్రమే మహిళా న్యాయమూర్తులున్నారు. మొత్తం 754 హైకోర్టు జడ్జీలలో 106 గురు మాత్రమే మహిళా జడ్జీలున్నారు.
జడ్జీల పరీక్షల్లో స్త్రీలదే ప్రతిభ…
ప్రవేశస్థాయి న్యాయమూర్తుల పోటీ పరీక్షలలో మహిళా న్యాయవాదులు ప్రతిభ చూస్తే స్త్రీలకు అవకాశం కల్పిస్తే ఏవిధంగా తమ ప్రతిభను న్యాయవ్యవస్థకు అందిస్తారో తెలుస్తుంది. కేరళలో 2023లో ఈ పరీక్షల ద్వారా నియమితులైన న్యాయమూర్తులలో 72% మంది మహిళలు. కేరళలో 2023లో 72%, ఉత్తరప్రదేశ్ 2022లో 54%, ఢిల్లీ 2023లో 66%, రాజస్థాన్ 2023లో 58% మహిళా న్యాయవాదులు ఉన్నారు. సహజంగానే మహిళల శరీరధర్మం ప్రకారం మెదడు అభివృద్ధి, పరిపక్వత విషయాలపై పరిశోధనల ప్రకారం పురుషుడి కంటే ఎక్కువ సామర్థ్యం కల్గి ఉంటారని తెలిసింది. అలాంటివారికి అవకాశాలు కల్పిస్తే వారు నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.
కొలీజియం వ్యవస్థ – పాత్ర..
అనేక నివేదికల ప్రకారం కొలీజియం వ్యవస్థ ఏదైతే ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం చేస్తుందో, అది సరైన మార్గదర్శకాలు రూపొందించకుండా నియామకాలు చేయడం కారణంగా ఉన్నత న్యాయస్థానాలలో మహిళల సంఖ్య పెరగటం లేదు. 50% మంది స్త్రీలకు న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం ఉండాలని పిలుపునిచ్చిన మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ పదవీకాలంలో కూడా 184 మందిని ఉన్నత న్యాయమూర్తులుగా నియమిస్తే, హైకోర్టుకు సంబంధించి 168 మందిలో 17 మంది మహిళలున్నారని, సుప్రీం నియామకాల్లో ఒక్క స్త్రీ కూడా లేరని ”సుప్రీంకోర్టు అబ్జర్వర్” అనే వెబ్‌సైట్ తెలిపింది.
కారణాలు..
అనేక నివేదికల ప్రకారం స్త్రీ న్యాయమూర్తులు ఉన్నత న్యాయస్థానాలలోకి ప్రవేశించకపోవడానికి ప్రధానకారణం వ్యవస్థాపరమైనది. పితృస్వామిక భావజాల సమాజం కుటుంబ బాధ్యతలను మహిళలపై నెట్టేసి, అదే కారణంగా వారిని ఈ వృత్తిలోనికి తీసుకురాకపోవడం జరుగుతుందని మాజీ సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
జిల్లాస్థాయి న్యాయస్థానాల్లో కేవలం 6.5% వాటిల్లో మాత్రమే టాయిలెట్ సౌకర్యాలున్నాయి. ఇలాంటి వ్యవస్థాపరమైన అడ్డంకులు కూడా మహిళలు ఈ వృత్తులలో రాణించలేక పోవడానికి కారణమని తెలిపారు.
సరైన ప్రోత్సాహం లేక మహిళా న్యాయమూర్తులు వెనుకబడుతున్నారనే విషయం మనం జూనియర్ సివిల్ జడ్జి స్థాయిలో పోటీలలో కనబడరుస్తున్న ప్రతిభను చూస్తే అర్థమవుతుంది. పోటీ పరీక్షల్లో ముందంజలో ఉన్న మహిళా అభ్యర్థులు, ఉన్నత న్యాయస్థానాలలో నియామకానికి అనర్హులుగా మారుతున్నారు.
లింగ నిష్పత్తి, భిన్నత్వం లేకపోతే..
‘న్యాయవ్యవస్థలో లింగ నిష్పత్తి ప్రకారం, భిన్నత్వం ప్రకారం అనగా వివిధ వర్గాల ప్రజల నుంచి ప్రాతినిధ్యం లేకపోతే అది సమాజంలో న్యాయవ్యవస్థ పట్ల ప్రజావిశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకేరకమైన తీర్పులు రావటానికి అవకాశం ఉంటుంది’ అని భారత సుప్రీం కోర్టులో జరిగిన ప్రపంచ న్యాయమూర్తుల సదస్సులో బ్రిటన్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్ అన్నారు. ఇదే విషయాన్ని జస్టిస్ దీపక్‌గుప్తా వక్కాణించారు.
సుప్రీం హ్యాండ్ బుక్..
లింగ వివక్షను సూచిస్తూ వాడే భాషను మార్చాలని ఇటీవల సుప్రీం కోర్టు అన్ని కోర్టులకు, న్యాయవాదులకు ఆదేశాలిస్తూ ఎలాంటి పదాలకు, ఎలాంటి పదాలను వాడాలో సూచిస్తూ స్వయంగా ఒక పుస్తకాన్ని రూపొందించి, విడుదల చేశారు. అలాగే స్త్రీల పట్ల కలిగి ఉండే పొరపాటు భావనలను, నిజాలను ప్రస్తావిస్తూ ఒక పట్టికను కూడా తయారుచేశారు. ఉదా : స్త్రీలందరూ పురుషుల కంటే శారీరకంగా బలహీనంగా ఉంటారనేది అపోహ అని చెబుతూ నిజం ఏమిటో వివరించింది. అలాగే స్త్రీలు ధరించే వస్త్రాలను బట్టి వారి గుణగణాలను నిర్ణయించరాదని, ఒకరకమైన వస్త్రాలు ధరించారు కాబట్టి పురుషులు వారిని తాకవచ్చని భావించరాదని చెప్పింది. ఇల్లాలు /గృహిణి అని కాకుండా హోమ్ మేకర్ అనాలని పేర్కొంది.
లింగ సమానత్వం అంటే ?
కేవలం మహిళల సమానత్వమే కాకుండా సమాజంలో వివక్షకు గురవుతున్న అన్ని జాతుల వారి విషయంలో కూడా లింగ వివక్ష పోవాలని సుప్రీం కోర్టు పేర్కొంటుంది. ట్రాన్స్‌జెండర్లు, స్వలింగ సంపర్కులు వంటివారి విషయంలోనూ సమానత్వ భావన రావాలి. నల్సా (ఎన్ఎఎల్ఎస్ఎ) తీర్పు ద్వారా ట్రాన్స్‌జెండర్‌లు మూడవ జెండర్‌గా గుర్తించబడ్డారు. వారి రక్షణకు మార్గదర్శకలు రూపొందించాలని తీర్పు చెప్పారు.
సమానత్వానికి పరిష్కారాలు..
లింగ సమానత్వం కోసం రిజర్వేషన్లు చేయవచ్చని అలాంటి అవకాశం రాజ్యాంగం 15(3)(4) మరియు ఆదేశిక సూత్రాలలో ఉందని జస్టిస్ రవీందర్ భట్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని చెప్పి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ప్రస్తావించారు.
ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల విషయంలోనూ రిజర్వేషన్లు ఉండాలని చాలా నివేదికలు పేర్కొన్నాయి. రిజర్వేషన్లు చారిత్రక అన్యాయానికి గురైన వారికి మాత్రమే కాక, స్త్రీలవంటి వివక్షకు గురైన వారికీ కల్పించవచ్చని రవీందర్ భట్ అభిప్రాయపడ్డారు.
జడ్జీల నియామక వ్యవస్థను సంస్కరించాలని, ఆ నియామకాల్లో సామాజిక వైవిధ్యం ప్రతిబింబించేలా నిబంధనలు రావాలి.
సామాజిక అవగాహన, చైతన్యం పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. అలాగే న్యాయవ్యవస్థ అవస్థాపన సౌకర్యాలు, మహిళలు , ఇతర వివక్షకు గురవుతున్న వర్గాలకు అందుబాటులో ఉండేందుకు న్యాయవ్యవస్థ మారాలి.
వివక్ష నిర్మూలనకు కృషి..
రాజ్యాంగంలోని 14, 15, 16 తదితర అధికరణాలు లింగ వివక్షకు వ్యతిరేకంగా రూపొందించబడ్డాయి. వాటి ఆధారంగా సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టులు మహిళల సమానత్వం కోసం, అభివృద్ధి కోసం తీర్పులు చెప్పాయి.
ప్రధానంగా విశాఖ వర్సెస్ గుజరాత్ కేసులో పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధకతను గురించి చెప్పగా, ఇటీవల 2017లో షయరోబానో కేసులో త్రిబుల్ తలాక్‌ను రద్దు చేసింది. 2018లో వచ్చిన జోసిఫ్‌షైన్ కేసు సె.497ఐపిసి ని రద్దు చేయటం ద్వారా మహిళలను ఆస్తిగా పరిగణించే వ్యభిచార నేరాన్ని రద్దు చేసింది. నవతేజ్‌సింగ్ జోహార్ కేసులో 2018లో స్వలింగ సంపర్కుల విషయంలో, ఎల్‌జిబిటి వ్యక్తుల హక్కుల విషయంలో ఉన్న వివక్షను తొలగిస్తూ సె.377ని రద్దు చేసింది. శబరిమల కేసులో మహిళలకు సమాన పూజా హక్కులను కల్పించింది. భారత సైన్యంలో మహిళలకు, పురుషులతో సమానంగా హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ బబితాపునియా కేసులో 2020లో తీర్పు చెప్పింది. అవివాహిత మహిళలకు అబార్షన్ హక్కులను వివరిస్తూ 1971 ఎంటిపి చట్టాన్ని విస్తృతపరుస్తూ ఎక్స్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేసులో 2022లో తీర్పు చెప్పింది. 2015లో వచ్చిన లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆసిడ్ బాధితురాళ్ళకు ఉపశమనం కల్పించే తీర్పు చెప్పింది.
విమానాల్లో మహిళ పట్ల వివక్షను చూపిస్తూ వివాహంపై విధించిన నిబంధనను కొట్టి వేస్తూ ఎయిర్ ఇండియా వర్సస్ నర్గేష్ మీర్జా కేసులో తీర్పు చెప్పింది. చాలాకాలం క్రితం సి.బి. ముత్తమ్మ కేసులో కూడా ఇండియన్ ఫారిన్ సర్వీసుల్లో మహిళల వివాహాలపై ఉన్న నిబంధలను రద్దు చేసింది. అనూజ్‌గార్గ్ వర్సెస్ హోటల్ అసోసియేషన్ కేసులో మద్యం సేవించటానికి అవకాశం ఉన్న హోటల్స్‌లో మహిళలను నిషేధిస్తూ తెచ్చిన చట్టం స్త్రీల సమానత్వానికి వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేసింది. కోర్టుల జోక్యం ద్వారా అనేక చట్టాలు రూపొందించబడినాయి. ఉదా: మెటర్నిటీ బెనిఫిట్ చట్టం 1961, సమాన వేతన చట్టం 1976, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టం 2013 మొదలైనవి.
పొత్తూరి సురేష్‌కుమార్, సుప్రీం కోర్టు అడ్వకేట్
9849401041